Minister Sabitha lunch with Sanitation Workers: కొవిడ్ క్లిష్ట సమయాల్లో అందరూ ఇంటికే పరిమితమైనా.. పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడ్డారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వారి సేవలు ఎనలేనివని కొనియాడారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మునిసిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లు, పలు నిత్యావసర వస్తువులు, గుర్తింపు కార్డులను మంత్రి సబితా, ఎంపీ రంజిత్ రెడ్డి పంపిణీ చేశారు.
అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. వారికి స్వయంగా వడ్డిస్తూ.. వారి క్షేమసమాచారాలు తెలుసుకుంటూ కాసేపు సరదాగా గడిపారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సబిత హామీ ఇచ్చారు.
అనంతరం జల్పల్లి పురపాలక సంఘం పరిధిలోని ఎర్రకుంట మెయిన్ రోడ్ నుంచి పహాడీషరీఫ్ మెయిన్ రోడ్డు వరకు రూ. 50 లక్షల వ్యయంతో.. సెంట్రల్ లైటింగ్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కోతమోని కుంట చెరువు నుంచి గుర్రం చెరువు వరకు రూ.10 కోట్ల 66 లక్షల వ్యయంతో జరుగుతున్న ఎస్ఎన్డీపీ పనులను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లా బిన్ హమద్ సాది, జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: TRS Bayyaram Protest: 'కేసీఆర్... దేశ రాజకీయాలు ఏలుతారనే తెలంగాణపై వివక్ష'