అగ్రి హబ్(AGRI HUB) ఏర్పాటు రైతులకు ఎంతో ఉపయోగకరమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయులు ముందుంటారని పేర్కొన్నారు. పత్తి పంటలో పురుగు ఫొటో తీసి పంపితే ఏం చేయాలో రైతులకు చెబుతున్నారని కొనియాడారు. ఇన్నోవేషన్ ఎవరి సొత్తు కాదని స్పష్టం చేశారు. ఎవరు ఏ కొత్త పరికరం కనిపెట్టినా ప్రోత్సహించాలని సూచించారు.
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపే ఆలోచనలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయంలో అగ్రిహబ్ ఏర్పాటైంది. ఈ భవనాన్ని మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమమలో నాబార్డు ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు దంపతులు, సీజీఎం వైకే రావు, పీజేటీఎస్ఏయూ ఉపకులపతి వెల్చాల ప్రవీణ్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రూ. 9కోట్ల నాబార్డ్ నిధులతో అగ్రిహబ్ రూపుదిద్దుకుంది.
సామాన్యుడికి ఉపయోగపడని టెక్నాలజీ నిష్ఫలం. బ్లాక్‌చైన్, రోబోటిక్, క్లౌడ్, డ్రోన్ టెక్నాలజీలతో పెనుమార్పులు వచ్చాయి. తల్లి కష్టం చూడలేక ఓ యువకుడు ఆసు యంత్రం కనిపెట్టారు. రైతును మించిన ఇన్నోవేటర్ లేడు. ఆవిష్కరణలను గుర్తించి ఔత్సాహికులను ప్రోత్సహించాలి. అగ్రిహబ్ ప్రతి ఒక్కరికి అండగా నిలవాలి. అగ్రిహబ్‌లో తెలుగుకు పెద్దపీట వేస్తాం. -కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
టీ- ఫైబర్‌తో అనుసంధానం
రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్ అన్నారు. ఆయిల్‌పామ్ విషయంలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలవాలని స్పష్టం చేశారు. 2,601 రైతు వేదికలను టీ-ఫైబర్ ద్వారా అనుసంధానం చేస్తామని కేటీఆర్ చెప్పారు. రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం పూర్తికాలేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రెండో హరిత విప్లవం కొనసాగుతోందని చెప్పారు. నీలి విప్లవంలో మత్స్య సంపద బాగా పెరిగిందన్న కేటీఆర్.. సాగునీటి రంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని వెల్లడించారు. సిరిసిల్ల ప్రాంతంలో 6 మీటర్ల భూగర్భ జలం పెరిగిందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల విజయగాథను ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో పాఠంగా చేర్చారని పేర్కొన్నారు.
వైవిధ్యం అవసరం: నిరంజన్ రెడ్డి
వ్యవసాయ పరిశోధనలపై ఆచార్య జయశంకర్ వర్సిటీ మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పంటల సాగులో వైవిధ్యం అవసరమని చెప్పిన ఆయన.. ప్రపంచ వర్సిటీలతో జయశంకర్ వర్సిటీ పోటీ పడాలని సూచించారు. వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించామని వెల్లడించారు. త్వరలో వేరుశనగ పరిశోధన కేంద్రానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు.
విశేష కృషి
కొవిడ్ సంక్షోభంలోను వ్యవసాయ రంగం చెక్కుచెదరలేదని నాబార్డు ఛైర్మన్ గోవిందరాజులు అన్నారు. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై ఐసీఏఆర్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విశేషంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొస్తున్న అంకుర కేంద్రాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తెలంగాణలో విద్యుదుత్పత్తిని నిలువరించాలి... కేఆర్‌ఎంబీకి ఏపీ లేఖ