రంగారెడ్డి జిల్లాలో ఏడో విడత హరితహారం(Haritha Haram) కార్యక్రమం మొదలైంది. పెద్ద అంబర్‌పేట్ కలాన్ వద్ద మంత్రి కేటీఆర్(Minister KTR) మొక్కను నాటి హరితహారాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra REDDY), ఇంద్రకరణ్ రెడ్డి(Indra Karan Reddy)లతో కలిసి అర్బన్ ఫారెస్ట్ పార్కు(Urban Forest Park)ను ప్రారంభించారు.
కరోనాతో దేశమంతా తల్లడిల్లిపోయింది. ఆక్సిజన్ కొరతతో దేశమంతా ఇబ్బందులు పడింది. ప్రాణవాయువు.. ప్రాణమిచ్చే చెట్లను పెద్దఎత్తున పెంచాలి. హరితహారం కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు... మనందరి బాధ్యత. భూమిని కాపాడుకోవడానికి పెద్దఎత్తున మొక్కలు నాటాలి. ప్రజాప్రతినిధులు, అధికారులతోనే హరితహారం విజయవంతం కాదు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే హరితహారం విజయవంతమవుతోంది. రాష్ట్రంలో 28 శాతానికి అడవుల విస్తీర్ణం పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో 129 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. హెచ్‌ఎండీఏ(HMDA) పరిధిలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఏర్పాటు చేస్తాం.
-మంత్రి కేటీఆర్
ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం(Haritha Haram) మళ్లీ ప్రారంభమైందని కేటీఆర్(KTR) తెలిపారు. ఏడో విడత హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మొక్కలు నాటేలా ప్రణాళికలు రచించామని తెలిపారు. దానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటాలని సూచించారు. రహదారుల వెంట బహుళ దశల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హరితహారంపై పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో పచ్చదనం 23.4 శాతం నుంచి 28 శాతానికి పెరిగింది. ప్రాణవాయువును అందించడంలో అర్బన్ ఫారెస్ట్ పార్కులు కీలకం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనవెంట ఉండేది చెట్టు మాత్రమే. పచ్చదనం 33 శాతానికి చేరుకోవాలన్న కేసీఆర్ కల నెరవేరాలి. దేశానికి పాఠాలు చెప్పే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలి. సీఎం పుణ్యంతో దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల స్ఫూర్తితో కేంద్రం నగరవన్ చేపట్టింది. దేశానికి ఆదర్శంగా నిలిపిన అటవీశాఖకు అభినందనలు.
- మంత్రి కేటీఆర్
హరితహారాన్ని రాజకీయ ఆపేక్షతోనో... రాజకీయ లబ్ధి కోసమో చేస్తున్నది కాదని మంత్రి తెలిపారు. భవిష్యత్ తరాలకు మనకంటే మెరుగైన పర్యావరణాన్ని ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ పుడమిని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలని సూచించారు. 220 కోట్ల మొక్కలు నాటేలా.. 5,900 కోట్ల రూపాయలు ఖర్చుతో... ప్రపంచ చరిత్రలోనే మూడో అతి పెద్ద ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కాబట్టి మొక్కలు నాటడం, పెంచడం, సంరక్షించడం అనేది అలవాటు చేసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: నేటి నుంచి అవి పనిచేయవ్- కొత్త రూల్స్ ఇవే...