రిజర్వేషన్లను మార్చకుండా, ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నా పోటీ చేసేందుకు కొత్త చట్టాలు రూపొందించేందుకు కుతంత్రాలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. మజ్లీస్, తెరాస పార్టీలకు అడ్డుకట్ట వేసి.. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో అధికారాన్ని సాధిస్తామని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఐఎస్ సదన్ డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో భాగ్యనగర్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సాంకేతికంగా దేశం ముందంజలో ఉండగా బ్యాలెట్ బాక్సుల ద్వారా బల్దియా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, బాబుమోహన్, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి, వెంకటరెడ్డి, సుభాష్ చందర్జీ, గ్రేటర్ భాజపా నేతలు పాల్గొన్నారు.