HC on Covid and Online Classes: ఈ నెల 28 వరకు విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ తరగతులు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పాఠాశాలలకు వెళ్లలేని వారికి ఆన్లైన్లో పాఠాలు నేర్చుకునే అవకాశం ఉండాలని స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు నిలిపివేస్తూ.. స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం.. మరోసారి విచారణ చేపట్టింది.
ఆన్‌లైన్ తరగతులు చేపట్టాలి
విద్యా సంవత్సరం నష్టపోవద్దన్న ఉద్దేశంతోనే బడులు తెరిచామని.. కరోనా నియంత్రణ చర్యలన్నీ తీసుకుంటున్నామని పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు దేవసేన నివేదిక సమర్పించారు. ప్రభుత్వ బడుల్లో భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యం కాదని.. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఆన్‌లైన్ బోధన నిర్వహించాలని కోరారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం... మిగతా రాష్ట్రాల్లోనూ బడులు తెరిచారని ఇక్కడ ఇబ్బందేమిటని ప్రశ్నించింది. హైదరాబాద్ వంటి నగరాల్లోని పాఠశాలల్లో ఆన్‌లైన్ పాఠాలు బోధించవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ గతంలో ఆన్‌లైన్, టీవీ పాఠాలు బోధించారని న్యాయవాది పేర్కొన్నారు. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. నెలాఖరు వరకు ఆన్‌లైన్ బోధన కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అన్నీ సిద్ధం
రాష్ట్రంలో కరోనా పరిస్థితులను వివరిస్తూ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.40శాతం ఉందని... అత్యధికంగా నారాయణపేటలో 8.88, కామారెడ్డిలో 8.32, ఆసిఫాబాద్ లో 8 శాతం ఉందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 99 లక్షల ఇళ్లలో జ్వర సర్వే చేసి 4 లక్షల 32 వేల మందికి.. వైద్య కిట్లు ఇచ్చినట్లు డీహెచ్ తెలిపారు. చిన్నారుల చికిత్సలకు రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని.. రోజుకు లక్షకు పైగా పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మేడారం జాతరకు కరోనా నియంత్రణ చర్యలు చేపట్టామని.. కొవిడ్ పరీక్షా కేంద్రాలు, వైద్య శిబిరాలు, అంబులెన్సులు, ఆస్పత్రులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
విచారణ వాయిదా
వీధి సంతల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ తెలిపింది. మార్కెట్లలో కంటే బార్లు, రెస్టారెంట్ల వద్దే ఎక్కువగా జనం గుమిగూడుతున్నారన్న ధర్మాసనం.. కొవిడ్ నిబంధనలు, ఆంక్షలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. సమ్మక్మ, సారక్క జాతరలో కొవిడ్ జాగ్రత్తలన్నీ అమలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మాస్కులు ధరించకపోవడం వంటి కరోనా నిబంధనల ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలు వివరిస్తూ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నిర్లక్ష్యం వల్ల కొవిడ్ ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: MEDARAM Special Busses : మేడారం జాతరకు 4వేల ప్రత్యేక బస్సులు : ఆర్టీసీ ఎండీ
ఆ రాష్ట్రాల్లో ఉద్ధృతంగా కరోనా- 50లక్షల టీకాల ఎక్స్పైరీపై కేంద్రం క్లారిటీ