రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విద్యా దినోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన దివంగత బాబూ రాజేంద్రప్రసాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో వ్యవసాయ విద్యా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని వర్సిటీ ఉప కులపతి డా.వెల్చాల ప్రవీణ్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగం, రైతుల పాత్రతో పాటు వర్సిటీ పరిశోధనలు, ఫలితాలు, యాంత్రీకరణ, పనిముట్లు వంటి అంశాలపై శాస్త్రవేత్తలు, పాఠశాల విద్యార్ధులకు అవగాహన కల్పించారు.
వారి కష్టం తెలిసొచ్చింది...
వ్యవసాయం, వ్యవసాయ విద్యపై తమకు అవగాహన కలిగిందని విద్యార్థులు తెలిపారు. రైతు లేనిదే రాజ్యం లేదని... రైతు లేకపోతే మనకు తిండి లేదనే సంగతిని గుర్తించామన్నారు. ఇకపై అన్నదాతకు గౌవరం ఇవ్వాలంటూ... విద్యార్థులు తమ మనోగతాన్ని వ్యక్త పరిచారు. వ్యవసాయంతోపాటు కొత్త పోకడలు, వాతవరణ మార్పులు, నాణ్యమైన విత్తనం, భూమి, నీరు వంటి అంశాలే కాకుండా వర్సిటీ విస్తృత పరిశోధనలపై అవగాహన కలిగించారు.
ఈ రంగం పారిశ్రామిక వేత్తలనూ ఇస్తుంది...
చిన్నతనం నుంచే వ్యవసాయం, రైతులు, వ్యవసాయ విద్యపై విద్యార్థులకు సరైన అవగాహన ఉంటే... భవిష్యత్తులో ఈ కోర్సుల్లో చేరతారని వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్‌రావు తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మారేందుకూ ఈ రంగం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. పీజేటీఎస్‌ఏయూ బోర్డు సభ్యుడు డాక్టర్ ఎ.మనోహర్‌రావు, రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ కుమార్, పీజీ డీన్ మీనా కుమార్, పలు విభాగాల అధిపతులు, ఆచార్యలు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.