రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో తెలుగు సంగమం ఆధ్వర్యంలో సంక్రాంతి సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ గేయ రచయిత సిరివెన్నల సీతారామ శాస్త్రి హాజరయ్యారు.
రాష్ట్రం వేరైనా సంక్రాంతి, పొంగల్ రెండూ అమోఘమైనవేనని గవర్నర్ తమిళిసై అభిప్రాయం వ్యక్తం చేశారు. మకర సంక్రాంతి వంటకాలు న్యూట్రిషన్తో కూడినవన్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించండని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు భాషా సంస్కృతిని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. తెలుగు ప్రభుత్వాలు భాషా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం నేడు ఎక్కువగా ఉందని.. అందుకే తెలుగును కాపాడుకోవాలని దత్తాత్రేయ చెప్పారు,.
భాషలో కొన్ని మార్పులు వస్తున్నప్పటికీ... ఆత్మ మాత్రం అలాగే ఉందని సిరివెన్నల సీతారామ శాస్త్రి తెలిపారు. అమ్మ అనే పదాన్ని మర్చిపోకపోతే... తెలుగును కూడా మర్చిపోలేమన్నారు.
ఇవీ చూడండి: ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడితో పోలీసులకు తిప్పలు