Rangareddy District Library : ఉద్యోగ నోటిఫికేషన్ల రాకతో అభ్యర్థులు ప్రభుత్వ కొలువులు సాధించడమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గంటల కొద్దీ ఎలాంటి అవాంతరాలు లేకుండా చదువుకునే ఉద్దేశంతో గ్రంథాలయాల బాట పడుతున్నారు. ఉద్యోగార్థుల కోసం రాష్ట్రంలోని పలు గ్రంథాలయాలు కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
good facilities at Rangareddy District Library : పోటీ పరీక్షల దృష్ట్యా ప్రభుత్వం మహేశ్వరం నియోజకవర్గ పరిధి బడంగ్‌పేట్‌లోని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో అభ్యర్థులకు అన్ని ఏర్పాట్లు చేసింది. మహిళా అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడం, మహిళా సిబ్బంది పర్యవేక్షించడం ఇక్కడి మరో ప్రత్యేకత. అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారు.
'ఈ లైబ్రరీ మా ఇంటికి దగ్గరలో ఉంది. ఇక్కడ మాకు కావాల్సిన పుస్తకాలు అన్నీ లభిస్తున్నాయి. నీళ్లు, వాష్‌రూమ్స్ అన్ని వసతులు బాగున్నాయి. మహిళలకు, పురుషులకు సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి. బయట నెలకు రూ.200 చెల్లించి చదువుకునే వాళ్లం. కొన్నిసార్లు సరైన సౌకర్యాలు కూడా ఉండేవి కావు. కానీ ఇక్కడ మేం ఉచితంగా చదువుకుంటున్నాం. సౌకర్యాలు కూడా బాగున్నాయి. ఇంకా పుస్తకాలు, పేపర్లు ఇవన్నీ కూడా ఉచితంగానే లభిస్తున్నాయి.' - ఉద్యోగార్థులు
పోటీ పరీక్షల కోసం సుమారు 5 వేల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. వీటితోపాటు 46 దినపత్రికలు, వార, మాస పత్రికలు ఉన్నాయి. నిత్యం 400 మంది అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. 2000 చదరపు గజాల్లో నాలుగున్నర కోట్ల వ్యయంతో 18 విశాలమైన హాల్స్, ఇతర గదులు నిర్మించారు.
'ఈ లైబ్రరీలో ప్రతి న్యూస్ పేపర్ అందుబాటులో ఉంది. ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు లభిస్తున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా ఉద్యోగార్థుల కోసం ఈ గ్రంథాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అడిగిన పుస్తకాలు ఒకవేళ లేకపోతే వెంటనే తెప్పిస్తున్నారు.' - ఉద్యోగార్థులు
గ్రంథాలయ ఆవరణమంతా మొక్కలతో ఆహ్లాదంగా ఉంటుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు మహిళలకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి పుస్తకాలు కావాలన్నా సిబ్బంది రెండురోజుల్లో సమకూరుస్తున్నారు.
'ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. లక్షల మంది అభ్యర్థులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా వారు చదువుకోవడానికి గ్రంథాలయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లైబ్రరీలున్నాయి. ప్రతి లైబ్రరీలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. ఉద్యోగార్థులకు అవసరమైన పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచుతున్నాం. ఏదైనా పుస్తకం లేదంటే వారు చెప్పిన మరుసటి రోజే వాటిని తెప్పిస్తున్నాం.' - సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
మరోవైపు రానున్న రోజుల్లో గ్రామీణ స్థాయి వరకు మరిన్ని గ్రంథాలయాలను విస్తరింపజేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి ఉద్యోగం సాధించాలని సూచించారు. ప్రభుత్వం సకల హంగులతో నిర్మించిన గ్రథాలయ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.