కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం... దళిత, గిరిజన ఓట్ల కోసం దళిత బంధు తెస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్కలు ఆరోపించారు. దళితబంధును ఒక్క హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రం అంతటా ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను కూడా గుంజుకొని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాల్లో భాగంగా రావిర్యాలలో ఈ నెల 18న నిర్వహించనున్న సభా ఏర్పాట్లను కాంగ్రెస్ ముఖ్య నాయకులు పరిశీలించారు. గత ఏడేళ్లలో దళిత గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి వారిని చైతన్య వంతులను చేసి... ఆత్మ గౌరవం పోరాటం కోసమే ఈ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సభలో ఏఐసీసీ ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితర ముఖ్య నాయకులు పాల్గొంటారని వివరించారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్కతో పాటు సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మల్రెడ్డి రామ్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఈనెల 18న మధ్యాహ్నం జరగనున్న దళిత గిరిజన దండోరాకు అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత విధానాలపై దండోరా మోగించాలి. మన సమస్యలను ఈ ప్రభుత్వం విస్మరించి కేవలం ఓట్ల సమయంలోనే తప్ప వేరే సందర్భాల్లో దళిత గిరిజనులను తొక్కేసినటువంటి చరిత్ర తెరాస ప్రభుత్వానిది. సీతక్క, ములుగు ఎమ్మెల్యే
ఇదీ చూడండి: Revanth Reddy: 'కేసీఆర్ సభ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడతాం'