చేవెళ్ల డివిజన్ పరిధిలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్‌లోని 111వ పోలింగ్ కేంద్రంలో గంట పాటు ఓటింగ్‌కు ఆటంకం కలిగింది. కనకమామిడి కేంద్రానికి చేరాల్సిన 60కి పైగా బ్యాలెట్ పత్రాలు పొరపాటున అజీజ్ నగర్ పోలింగ్ కేంద్రానికి చేరడం వల్ల ఏజెంట్లు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే 36 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లిపోయారు. దీనిపై ఆందోళనకు దిగిన ఏజెంట్లు తప్పుడు బ్యాలెట్ పత్రాలను సీజ్ చేయాలని కోరారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన అజీజ్ నగర్ రిటర్నింగ్ అధికారి గల్లంతైన బ్యాలెట్ పత్రాలను సీజ్ చేసి కొత్త బ్యాలెట్ కాగితాలతో రీ-పోలింగ్ నిర్వహించారు. ఓటేసిన 36 మందిని ఫోన్ ద్వారా పిలిపించి ఓటు వేయించి పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగించారు.
ముగిసిన తొలి విడత ప్రాదేశిక ఎన్నికలు
రంగారెడ్డి జిల్లాలో తొలి విడత ప్రాదేశిక ఎన్నికలు స్వల్ప ఉద్రిక్తతల నడుమ ముగిశాయి. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్లోని 7 జడ్పీటీసీలు, 93 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ ముగిసే సమయానికి 85 శాతంగా నమోదు
మరోవైపు ఇబ్రహీంపట్నం డివిజన్లోని మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో మండుటెండల్లోనూ వృద్ధులు తమ కుటుంబసభ్యుల సహకారంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 9 గంటల వరకు 16 శాతంగా నమోదైన పోలింగ్ మధ్యాహ్నాం ఒంటి గంటకు 57.78 శాతంగా నమోదైంది. మధ్యాహ్నాం 3 గంటల వరకు జిల్లాలో 71 శాతంగా నమోదైన పోలింగ్...సాయంత్రం 5 గంటలకు ముగిసే సమయానికి 85 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి : ఇన్ని జీవీకె 108 అంబులెన్స్‌లు ఎలా కాలిపోయాయి ???