Telangana Bhogi Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇళ్ల ముందు విభిన్న రంగులతో రంగవల్లులు వేస్తూ చిన్నా పెద్దా సందడి చేశారు. భోగి పండుగతో భోగభాగ్యాలు కలగాలని... ఏడాది అంతా సుఖశాంతులతో ఉండాలని కోరుతూ భోగిమంటలు వేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రమ్య గ్రౌండ్స్‌లో 20 అడుగుల ఎత్తు భోగిమంటలు వేసి సంబరపడ్డారు. నాచారం భవాని నగర్‌లో తెల్లవారుజాము నుంచే ఇంటి ముందు ఆడపడుచులు ముగ్గులు వేసుకొని భోగి సంబరాలు చేసుకున్నారు.
చిరుజల్లుల మధ్యే
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో వేకువజాము నుంచే భోగి మంటల సందడి మొదలైంది. ఇంటి ముంగిట రంగవల్లులు పెట్టి... భోగిమంటల మధ్య పెద్దలు, చిన్నారులు నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు. ఖమ్మంలో చిరుజల్లుల మధ్యే భోగి వేడుకలు నిర్వహించారు.
డూడూ బసవన్నల సందడి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో భోగి వేడుకలు వైభవంగా జరిగాయి. గాంధీ నగర్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో గంగిరెద్దుల విన్యాలు, హరిదాసుల నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునే లేచి వాకిట్లో రంగు, రంగుల ముగ్గులు వేసి.. ఆవు పేడతో గొబ్బెమ్మలను వాకిట్లో పేర్చి.. భోగి వేడుకలు చేసుకున్నారు. హనుమకొండ జిల్లాలోనూ వేకువ జామున నుంచే మహిళలు ఇంటి ముందు అలికి ముగ్గులు వేశారు. మంచును సైతం లెక్క చేయకుండా మహిళలు పోటీ పడి ముగ్గులు వేశారు.
బొమ్మల కొలువు
భోగిపండుగ రోజునే సాయంత్రం పిల్లలకు భోగి పండ్లు పోయడం ఆనవాయితీ. దీంతో పిల్లలకుండే దిష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. భోగినాటి సందడిలో బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎప్పట్నుంచో ఇంట్లో ఉన్న బొమ్మలను పోగేసి బొమ్మల కొలువు నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: Telangana Sakinalu: సంక్రాంతి వేళ సకినాల సందడి... తయారీ మహిళల సందడి