రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయిస్తున్న క్రమంలో రైస్ మిల్లర్లు తాలు ఉందని ధాన్యం కట్ చేస్తున్న సందర్భంగా ఆగ్రహానికి గురైన రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపిన రైతులకు ఆయన భరోసా కల్పించారు.
ఎఫ్సీఐ నిబంధనలకు అనుకూలంగా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత రైస్ మిల్లర్లతో సంబంధం లేకుండా చూడాలని ఆయన తెలిపారు. అవసరమనుకుంటే ఎఫ్సీఐ నిబంధనలను సడలించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆందోళన చేసిన రైతులపై కేసులు పెట్టినంత మాత్రాన రైతుల సమస్యలు తీరవని.. అన్నదాతలు రోడ్లపైకి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: హడలెత్తిస్తున్న కరోనా.. 1000కి చేరువలో కేసులు