రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని మే నెలాఖరులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. బుధవారం కలెక్టర్ కృష్ణ భాస్కర్, అదనపు కలెక్టర్ అంజయ్య, సంబంధిత అధికారులు, గుత్తేదారులతో కలిసి తుది దశకు చేరుకున్న నూతన కలెక్టరేట్ కార్యాలయం నిర్మాణ ప్రగతిని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదటగా కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, మీటింగ్ హాళ్లు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలను పరిశీలించారు. అనంతరం భవనం ఆవరణలో జరుగుతున్న సుందరీకరణ, గార్డెనింగ్, అప్రోచ్ రోడ్డు, తదితర పనులను సందర్శించారు.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నూతన కలెక్టరేట్ వద్ద జరిపేందుకు వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. తుది దశలో ఉన్న పనులను నాణ్యత లోపించకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల చివరిలోగా భవనం పూర్తి స్థాయిలో నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసేలా చూడాలని ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు.