రామగుండం నగరాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్లో రూ. 1.8 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును, సీఎస్పీ కాలనీలో రూ. కోటి 75 లక్షలతో నిర్మించిన ట్యాంకును ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని కోరుకంటి అన్నారు.
సమస్యలను పరిష్కరించుకుంటూ..
ఉమ్మడి రాష్ట్రంలో ఆడపడుచులు తాగునీటి కోసం రోడ్లపై బిందెలతో ప్రదర్శనలు ఉండేవని.. ప్రత్యేక రాష్ట్రం అవతరించిన తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంతో తాగునీటి కష్టాలు తీరాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతి సమస్యనూ పరిష్కరించుకుంటూ పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 24 గంటల స్వచ్ఛమైన త్రాగునీరు అందించే దిశగా ప్రణాళిక సాగుతోందని తెలిపారు. రాబోయే కాలంలో ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల మంచినీటిని ఉచితంగా అందించే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రామ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం