పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ రాంరెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. రామగుండం ట్రాఫిక్ సీఐ రమేష్ బాబు, ఎస్సైలు, సిబ్బంది రోడ్లపైకి వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు చెబుతూనే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేశారు. వాహనాలపై ఇద్దరు వెళితే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వాహనాలను సీజ్ చేసినట్లు రామగుండం ట్రాఫిక్ ఏసీపీ రాంరెడ్డి పేర్కొన్నారు.
కరోనా నివారణకు 24 గంటలు కష్టపడుతున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని ఏసీపీ కోరారు. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లేవారు పోలీసు ఉన్నతాధికారుల వద్ద అనుమతి పత్రాన్ని తీసుకుని వెళ్లాలని సూచించారు. వాహనాలను సీజ్ చేస్తే లాక్డౌన్ ముగిసేవరకు వాటిని తిరిగి పొందే ఆస్కారం ఉండదని వాహనదారులకు చెప్పారు.
ఇవీ చూడండి: 'లాక్డౌన్ తొలగించినా... విద్యాసంస్థల్లో భౌతికదూరం'