Ramagundam CP meeting for arresting the accused of serial thefts : గత కొంత కాలంగా పెద్దపల్లి జిల్లాలో వరుస దొంగతనాలు స్థానికుల్లో భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇంటికి తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకొని దొంగలు పట్టపగలే దొంగతనాలు చేస్తున్నారు. ఇలా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న జట్పట్ పవన్ అనే నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అతడి దగ్గర నుండి పెద్ద మొత్తంలో నగదు బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ రేమ రాజేశ్వరి పెద్దపల్లి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
నేరాల నియంత్రణలో రామగుండం పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం సమయస్ఫూర్తితో విధులు నిర్వర్తిస్తోందని పోలీస్ కమిషనర్ రెమ రాజేశ్వరి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన నిందితుడు జెట్ పట్ పవన్ 2022 లో మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసిన విషయంలో చెన్నూరు, బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ సమయంలోనే దొంగతనాలు ఎలా చేయాలని తోటి నిందితుల వద్ద పట్టు సాధించినట్లు తెలిపారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన పవన్.. ఇటీవల పగటి పూట తాళం వేసిన ఇండ్లను పరిశీలించి రాత్రిపూట తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడేవాడు.
నిందితుడు పవన్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. క్లూస్ టీం ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసు యంత్రాంగం పవన్ను చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి 12 లక్షల 11 వేల నగదుతో పాటు 102 గ్రాముల బంగారు ఆభరణాలు , 645 గ్రాముల వెండి, ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్న నిందితులను ఎప్పటికప్పుడు గుర్తించి వారు సక్రమ మార్గంలో నడిచే విధంగా రామగుండం పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నట్లు సిపి చెప్పారు. కమిషనరేట్ పరిధిలోని ప్రజలు విలువైన ఆభరణాలు ఎక్కువ మొత్తంలో నగదు ఇళ్లలో ఉంచుకోరాదన్నారు. ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్తున్న సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలన్నారు. ఈ కేసులను చాకచక్యంగా చేధించిన పోలీస్ అధికారులకు సిబ్బందికి రివార్డులు అందజేశారు.
ఇవీ చదవండి..
3 కమిషనరేట్లు.. 23 దొంగతనాలు.. బ్రూస్లీ కన్నుపడితే ఇళ్లు ఖాళీ
Mobiles robbery in Adilabad : మొబైల్ షాప్లో దొంగతనానికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులు