PM Modi in Ramagundam : ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రాష్ట్ర పర్యటన బిజీబిజీ సాగింది. బేగంపేటలో భాజపా బహిరంగ సభ అనంతరం.. ప్రధాని మోదీ రామగుండం చేరుకున్నారు. రామగుండంలో 6 వేల 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి.. జాతికి అంకితం చేశారు. దానితో పాటు భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌ను ప్రారంభించారు. 3 జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో.. ప్రధాని ప్రసంగించారు. 2014 ముందు వరకు యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. నూతన సాంకేతికతో ఆత్మనిర్భర్‌లో భాగంగా... దేశీయంగా యూనియాను ఉత్పత్తి చేస్తున్నామని గుర్తు చేశారు. భవిష్యత్‌లో 'భారత్ యూరియా' పేరిట ఒకటే బ్రాండ్ లభ్యమవుతుందని... ప్రధాని స్పష్టం చేశారు. రామగుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల కర్మాగారం వల్ల... తెలంగాణ రాష్ట్రానికి ఎంతో లబ్ధి చేకూరనుందని.. ప్రధాని తెలిపారు.
"రామగుండం ఎరువుల కర్మాగారంతో తెలంగాణతో పాటు.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రైతులకు లద్ధి చేకూరనుంది. ఈ కర్మాగారం ద్వారా చుట్టు పక్కల వ్యాపారాలు అభివృద్ధి చెందనున్నాయి. లాజిస్టిక్, రవాణా సంస్థలు రానున్నాయి. 6 వేల కోట్ల రూపాయలకుపైగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఖర్చు చేసింది. దీని ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల లాభం... తెలంగాణ రాష్ట్రానికే దక్కనుంది." అని మోదీ అన్నారు.
PM Modi on Singareni Privatization : సింగరేణి విషయంలో కొందరు అబద్ధాలు చెప్తున్నారంటూ... ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే ఉందని... కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమే ఉందని లెక్కలతో సహా వివరించారు.
"దేశంలో అభివృద్ధిపనులు వేగవంతం అవుతాఉంటే.. కొంత మంది రాజకీయ స్వార్థంతో వికృత మనస్తత్వం ఉన్న వాళ్లు.. అబద్ధాలను ప్రచారం చేస్తూ జనాలను మభ్యపెడుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటువంటి వాళ్లే సింగరేణి సంస్థ... ఎస్‌సీసీఎల్‌ను ప్రైవేటు పరం చేస్తున్నామంటూ హైదరాబాద్ నుంచి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై లెక్కలతో మీకు వివరించడానికి సిద్ధంగా ఉన్నా. ఈ అబద్ధాలు ప్రచారం చేసే వారికి ఇది కూడా తెలియదు. సింగరేణిలో 51శాతం వాటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం 49శాతం మాత్రమే ఉంది. సింగరేణికి సంబంధించి ఏ నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. 51శాతం వాటా వాళ్ల దగ్గరే ఉంది. నేను మళ్లీ చెబుతున్నా.. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఈ అబద్ధపు మాటలు నమ్మకండి. ఈ ప్రచారం చేసే వాళ్లని.. హైదరాబాద్‌లోనే ఉండనివ్వండి." - మోదీ , ప్రధాన మంత్రి
బొగ్గు గనుల కేటాయింపులో పారదర్శకంగా నిర్వహిస్తూ... డీఎంఎఫ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలను అందిస్తున్నామని ప్రధాని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అన్ని విధాలా సహకరిస్తామని.. మరోసారి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
"బొగ్గు గనులను పారదర్శకంగా వేలం వేస్తున్నాం. ఎక్కడైతే బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారో... అక్కడ ఆ ప్రాంత అభివృద్ధి కోసం డిస్ట్రిక్ మినరల్ ఫండ్‌ను తీసుకువచ్చాం. ఈ నిధులకు సంబంధించి వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలకే ఇస్తున్నాం. అందరి అభివృద్ధి కోసమే పని చేస్తున్న మేము.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తాం. తెలంగాణ వేగవంత అభివృద్ధి కోసం మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి. రైతులకు అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు. ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మిమ్మల్ని చూసి... హైదరాబాద్‌లోని కొంత మందికి నిద్ర కూడా పట్టదు." అని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ సభ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రధాని ప్రసంగిస్తున్న వేళ... మోదీ మోదీ నినాదాలతో ఆకట్టుకున్నారు.