పెద్దపల్లి జిల్లా రైతులు వానాకాలం పంట సాగుకు సమయాత్తమవుతున్నారు. ఈసారి వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాలు మే నెలాఖరులోనే సమృద్ధిగా కురుస్తున్నాయని వాతావరణశాఖ స్పష్టంచేస్తోంది. ఈనెల 25న రోహిణికార్తె రానుండగా సాగు జోరు అందుకోనుంది. జిల్లాకు ఒకవైపున ఎస్సారెస్పీ సాగునీళ్లు రానున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రానుండటంతో సాగు అధికంగా ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
దొడ్డురకం కంటే సన్నరకంపై దృష్టి
దొడ్డురకాలు 120 రోజుల్లోనే పంట చేతికందుతుండటంతో గత రబీలో రికార్డుస్థాయిలో 77,800 హెక్టార్లలో వరి సాగైంది. సాధారణ సాగు విస్తీర్ణం 43,699 హెక్టార్లు ఉండగా అదనంగా 34,081 హెక్టార్లలో వరి సాగైంది. ఈ వానాకాలంలో 1,49,939 హెక్టార్లలో 1,15,000 వేల మంది రైతులు సాగు చేయనున్నట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. దొడ్డురకాలకు అగ్గితెగులు, కంకినల్లి, ఇతరత్రా తెగులు, తాలు రూపేణా అధికనష్టం రావడంతో ఎక్కువ మందిరైతులు ఈసారి సన్నరకం ధాన్యాల వైపు తమ దృష్టి మరల్చినట్లు అధికారులు చెబుతున్నారు. మేలైన సన్నరకాలపై తమను ఆరా తీస్తున్నట్లు పేర్కొంటున్నారు.
పంట ప్రణాళిక సిద్ధం
ఈ వానాకాలం సీజన్‌లో 1.49 లక్షల హెక్టార్లలో సాగు చేయనుండగా ఎక్కువగా వరి 77,960 హెక్టార్లు, పత్తి-31,122, మొక్కజొన్న-1,727, కంది-273, పెసర-225, కూరగాయలు-2,588 సాగుకానున్నాయి. 1044 హెక్టార్లలో ఇతర పంటలు రైతులు సాగు చేయనున్నారని అధికారులు అంచనావేస్తున్నారు.
జిల్లాలో 69,500 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతుండగా ఇందులో టన్నుల వారీగా డీఏపీ-8వేల టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు-20,500, యూరియా-34,500, పొటాష్- 6,500 టన్నులు అవసరం ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రస్తుతానికి 21,914 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులకు 14,400 క్వింటాళ్ల రాయితీ విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉండగా ఇందులో వరి-11,000, మొక్కజొన్న-60, కంది-50, పెసర-68, మినుములు-50, పచ్చిరొట్ట ఎరువులు-3,172 క్వింటాళ్లు అందజేయనున్నారు.
11 తర్వాత రుణమాఫీ సొమ్ముఖాతాల్లోకి
రైతు రుణమాఫీకి సంబంధించి రూ.25 వేలలోపు రుణాలు ఉన్న వారికి ఏకకాలంలో మాఫీ చేస్తుండగా ఆ పైన రుణాలు పొందిన వారికి మాత్రం నాలుగు విడతల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో తొలివిడత రుణమాఫీ కింద రూ. 50 కోట్లు సోమవారం తర్వాత రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమకానున్నాయి.