పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. రామగుండం అర్జీ-1 ఏరియాలోని ఇసుక బంకర్ల వద్ద చిరుత దాడిలో మూడు కుక్కలు మృతి చెందడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆ మృగం మంచిర్యాల జిల్లా నుంచి గోదావరి నది మీదుగా వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.
సింగరేణి సిబ్బంది ఇచ్చిన సమాచారం అందుకున్న పెద్దపెల్లి అటవీశాఖ అధికారులు చిరుత సంచరించిన పరిసరాలను పరిశీలించారు. ఇసుక బంకర్ సమీపంలో కనిపించిన మృగం అడుగులు చిరుతవేనని అటవీశాఖ అధికారి రవి ప్రసాద్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా ఎవరు బయటకు వెళ్ళకూడదని హెచ్చరించారు. సింగరేణి అధికారులు హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. 24 గంటల వరకు ఆ ప్రాంతంలో ఎవరికీ విధులు కేటాయించవద్దని అధికారులు సూచించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలతోపాటు సింగరేణి కార్మికులు కూడా మృగం కనబడితే తమకు సమాచారం అందించాలని కోరారు. చిరుతకు ఎలాంటి ప్రాణహాని చేయకూడదని స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: బెంగళూరు కేంద్రంగా దా'రుణా'లకు యత్నం.. నిందితులు అరెస్ట్