వర్షాల కారణంగా సింగరేణిలో ఆరు జిల్లాల పరిధిలోని 19 ఉపరితల గనుల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. నిత్యం 80 శాతానికి పైగా ఉత్పత్తి ఉపరితల గనుల నుంచే జరుగుతోంది. జూన్ వరకు రోజూ 2 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఉండగా.. వర్షాకాలం అయినందున జులైలో 1,84,187 టన్నుల ఉత్పత్తి చేయాలని సంస్థ నిర్ణయించుకుంది. భూగర్భ గనుల నుంచి 27,612 టన్నుల లక్ష్యానికి గానూ.. కేవలం రోజుకు 14 నుంచి 16 వేల టన్నుల లోపు ఉత్పత్తి సాధ్యమవుతోంది.
రోజుకు సగటున 1.60 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిన ఉపరితల గనుల్లో క్రమంగా తగ్గిపోతోంది. జులైలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో రోజువారీ సగటు ఉత్పత్తి 45 వేల టన్నులకు పడిపోయింది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా విలువైన 14 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. విద్యుత్తు కేంద్రాలకు రోజూ 33 నుంచి 35 రేక్‌ల బొగ్గును రవాణా చేయాల్సి ఉండగా, నాలుగైదు రోజులుగా సగటున 8 నుంచి 9 రేక్‌లు పంపుతున్నారు. కొరత నివారణకు 24 భూగర్భ గనుల్లో ఒక్కో యంత్రం సగటున 150 టన్నుల ఉత్పత్తి చేయాలని సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణలు జీఎంలందరికీ ఆదేశాలిచ్చారు.