రైతుల పంట పొలాలు నీట మునిగితే ఇంతవరకు సర్వే చేపట్టలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు(MLA Sridhar babu) విమర్శించారు. ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. ఒకే నెలలో మూడుసార్లు పంట నీట మునిగితే అధికారులు ఇంతవరకు చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి వచ్చే నీటి ప్రవాహంతో రైతుల పంటలు నీట మునిగిపోతున్నాయని అన్నారు. సాంకేతిక ఇబ్బందులను గుర్తించకుండా నీటిని పెద్ద మొత్తంలో వదలడం అధికారుల అనాలోచితమైన నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వర్ష సూచన ఉన్నా కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినా కనీసం అధికారులు సర్వే చేయలేదని మండిపడ్డారు. నష్టపోయిన రైతుల భూములను సరే చేసి రైతులను ఆదుకోవాలన్నారు. కౌలు రైతులకు కూడా రైతుబంధును అమలు చేసేలా చూసి పంట నష్టానికి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సమగ్ర సర్వే నిర్వహించి అన్నదాతలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
బ్యారేజ్ నిర్మాణం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వీటి ద్వారా నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలే. ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకు లాభం జరగలేదు. ఇవాళ వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయినా పట్టించుకున్నా పాపాన పోలేదు. అధికారులు ఎవరే గానీ ఇంతవరకు సర్వే చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్‌ల నిర్మాణం వల్ల రైతుల నీటిలో పంటలు మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా బ్యారేజ్‌లు నిర్మించడం వల్ల రైతుల పంటలు నాశనమవుతున్నాయి. సాంకేతిక పరమైన ఇబ్బందులను అధిగమించి అధికారులు చర్యలు చేపట్టాలి. ఇంతవరకు పంటనష్టంపై ఎన్యూమరేషన్ ఎందుకు చేయలేదు. కచ్చితంగా సర్వే చేసి రైతులకు పరిహారం చెల్లించాల్సిందే.-
దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంథని ఎమ్మెల్యే
ఇదీ చూడండి: FARMERS PROTEST: 'రెండేళ్లుగా మునిగిపోతున్నా పరిహారం ఇవ్వరా?'