పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో.. అత్యవసరంగా నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ రసాభాసగా మారింది. సమావేశం ఏక పక్షంగా జరిగిందంటూ మేయర్ అనిల్ కుమార్తో కాంగ్రెస్ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. మేయర్ ఛాంబర్లో బైఠాయించి ఆందోళన చేపట్టారు.
చేతిలో అధికారముందని.. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా బిల్లులకు ఏక పక్షంగా ఆమోదం తెలుపుతున్నారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. పబ్లిక్ మీటింగులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే సోకని కరోనా.. ప్రజా సమస్యలపై జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తే వస్తుందా అంటూ ప్రశ్నించారు. కాన్ఫరెన్స్లో అధికార పార్టీ కార్పొరేటర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా.. అధికారులు స్పందించలేదని గుర్తు చేశారు. ప్రజా ధనాన్ని వృథా చేయకుండా కరోనా నుంచి ప్రజలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.
ఘటనపై స్పందించిన మేయర్.. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగానే అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. నగరంలో శానిటేషన్తో పాటు పలు అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: రాబంధుల్లా అంబులెన్స్ డ్రైవర్లు.. ఆందోళనలో కరోనా మృతుల కుటుంబాలు