కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ... తప్పకుండా మాస్కులు ధరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రభుత్వం ద్వారా నిర్వహించే పనులను తనిఖీ చేశారు. ఉపాధి హామీ పనులను పరిశీలించి, కూలీలతో మాట్లాడారు. పనులకు 579 మంది కూలీలు పాల్గొనటం వల్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకున్న డబ్బులతో పాటు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన రూ. 1500 ఇంతవరకు రాలేవని కలెక్టర్కు కూలీలు విన్నవించుకున్నారు. ఎవ్వరూ అందోళన చెందవద్దని... ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు జమ అయ్యేటట్లు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నచ్చజెప్పారు.
అనంతరం గ్రామంలోని నర్సరీని సందర్శించారు. నిర్వహణ లోపం వల్ల ఎండిపోయిన, ఎదగని మొక్కలను చూసి అసహనం వ్యక్తం చేశారు.



