సునీల్ నాయక్ ఆత్మహత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ పతనం మొదలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. తెరాస ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని సమరభేరీ సభలో పాల్గొన్న బండి ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం నుంచి రాష్ట్రంలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు.
భాజపా గూటికి మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి..
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి, ఆయన తనయుడు సునీల్ రెడ్డి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. జెండాలను పక్కనపెడదాం.. రాజకీయాలు పక్కన పెడదాం... రాక్షసుని చేతుల నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పిద్దామని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడక.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వామన్రావు జంటహత్యకేసులో అధికారుల హస్తం
గోదావరిజలాల వినియోగం కోసం అప్పటి భాజపా నాయకులు సస్యశ్యామల యాత్ర చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య ఉద్యమం కోసం భాజపా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు జంట హత్య కేసులో కొంతమంది పోలీసు అధికారుల పాత్ర ఉందని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.
పోలీసులను భాజపా ఆదుకుంటుంది
మంథనిలో పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని... పోలీసులకు ఏ ఆపద వచ్చినా భాజపా ఆదుకుంటుందని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ అన్నారు. ఈ సమరభేరి సభలో మాజీ ఎంపీ భాజపా కన్వీనర్ వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.