నియంత్రిత సాగుతో రైతుకు మంచి లాభం చేకూరుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నూతన వ్యవసాయ విధానంపై పెద్దపల్లి మండలం అప్పనపేట గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తే రైతులకు లాభం చేకూరుతుందని కలెక్టర్ అన్నారు. ఈ అంశాన్ని పరిశీలించిన ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశ పెట్టిందని తెలిపారు.
అధ్యయనం ద్వారా పంట ప్రణాళిక
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న సాగు భూమిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎంతో అధ్యయనం చేసి జిల్లావారీగా పంట ప్రణాళిక అందించారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి 5వేల ఎకరాల క్లస్టర్‌కు వ్యవసాయ విస్తరణ అధికారి అందుబాటులో ఉన్నారని, అప్పన్నపేట క్లస్టర్ లో ఉన్న అధికారి సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు.
దొడ్డు రకం ధాన్యానికి డిమాండ్ లేదు
భూసారం ఎరువులు విత్తనాలు పండించే పంట సంబంధిత అంశాలపై రైతులకు ఉన్న సందేహాలను సంపూర్ణంగా వ్యవసాయాధికారులు నివృత్తి చేస్తారని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కలెక్టర్ కోరారు. వాన కాలంలో సన్నరకం ధాన్యం సాగు దిశగా రైతులు ఆలోచించాలని, దొడ్డు రకం ధాన్యం మార్కెట్ లో డిమాండ్ ఉండటం లేదని స్పష్టం చేశారు. వాన కాలంలో మక్కల దిగుబడి తక్కువగా వస్తుందని, యాసంగిలో మక్కల సాగు చేసి.. వాన కాలంలో పత్తి, కందులు సాగు చేయాలని సూచించారు.
సాగు లాభసాటిగా మారాలి
అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలని కొత్త వ్యవసాయ విధానం సీఎం ప్రవేశపెట్టారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడక ముందు ఎరువుల కొరత విత్తనాల సమస్య విద్యుత్ కోతలతో రైతులు అనేక అవస్థలు పడ్డారని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు ఉత్పన్నం అయినప్పటికీ.. రైతులందరికీ తప్పనిసరిగా రైతుబంధు సాయం అందిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి: రైతు రుణమాఫి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఈటల