నిజామాబాద్ జిల్లా బాల్కొండలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. యూరియా బస్తాలు వచ్చి పంపిణీ జరుగుతుందని తెలిస్తే చాలు రైతులు పంపిణీ కేంద్రం ముందు బారులు తీరుతున్నారు. బాల్కొండ ప్రాథమిక వ్యసాయ సహకార సంఘంలో ఈ రోజు యూరియా పంపిణీ చేపట్టారు. దీంతో రైతులు తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు. వరుసలో పట్టాదారు పాసుపుస్తకాలు ఉంచారు. 380 సంచులు స్టాకు ఉండగా ఒక్కో రైతుకు రెండు సంచులు చొప్పున అందజేశారు. స్టాక్ అయిపోవడంతో వరుసలో నిలబడిన కొంత మంది రైతులకు యూరియా అందలేదు. దీంతో సదరు రైతులు నిరాశగా వెళ్లిపోయారు.
ప్రధానంగా ప్రస్తుతం పొలంతో పాటు మొక్కజొన్న, సోయాబీన్ పంటలకు యూరియా వేయాల్సి ఉంది. ఈ సమయంలో రైతులకు సరిపోయేంత మందు అందించడం లేదు. దీంతో రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. పొలంలో ఎకరానికి సంచిన్నర, అదే మొక్కజొన్నకు రెండు నుంచి మూడు సంచుల వరకు, సోయాబీన్‌కు ఒక సంచి వరకు యూరియా వేయాలి. ఈ పరిస్థితిలో రైతుకు రెండు సంచుల చొప్పునే ఇవ్వడంతో పంటలకు తక్కుగా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా రైతులకు ఉన్న భూమిని బట్టి యూరియాను అందించడం లేదు. ఎంత భూమి ఉన్నా రెండు సంచులే ఇస్తున్నారు. దీని వల్ల ఎక్కువ భూమి ఉన్న రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Dengue: భాగ్యనగరంలో మోగుతున్న డెంగీ డేంజర్ బెల్స్