ఆర్టీసీ సమ్మెతో విద్యార్థులకు మరో వారం పాటు దసరా సెలవులను ప్రభుత్వం పొడిగించింది. వీటిని సద్వినియోగం చేసుకొని మధురానుభూతుల్ని పొందడానికి విద్యార్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆరాటపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి మూడేళ్ల తర్వాత చెరువులన్నీ అలుగులు పోస్తుండడం... వల్ల వాటి వద్దకు పర్యటకులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి జానకీబాయి చెరువు అలుగు వద్దకు గతంలో ఎన్నడూ లేనంతగా పర్యటకుల తాకిడి పెరిగిెంది. దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. తెలంగాణ వరప్రదాయనిగా పిలువబడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడం వల్ల నిండుకుండలా మారింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి స్నానాలు చేస్తూ... సేద తీరుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పని ఒత్తిడి పెరిగిందని, ఇలాంటి సందర్శనీయ ప్రదేశాల వల్ల ఎంతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం పొందుతున్నట్లు పర్యటకులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య