నందిపేట గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాలన్నింటిలో చేసే పని ఒక చోటనే జరిగితే ఎలా ఉంటుందనేది చేసి చూపించారు. ఇటీవల కేంద్రం ఇచ్చిన అవార్డుల కోటాలో 'దీన్‌దయాళ్ గ్రామ పంచాయతీ స్వశక్తి కరణ్' పురస్కారం సొంతం చేసుకొని జిల్లాకు పేరు తెచ్చిపెట్టింది.
ఉపాధిహామీ నిధులతో రూ.10 లక్షలతో మార్కెట్ యార్డు నిర్మించారు. పది శాతం ఇతర నిధుల భాగస్వామ్యం ఉంటే కూలీ పనిదినాలను బట్టి వచ్చే సామగ్రి కంపోనెంట్ ద్వారా సుందరంగా నిర్మించారు. కూరగాయల క్రయవిక్రయాలకు, రైతులకు రైతుబజార్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇక ప్రారంభించడమే తరువాయి.
షెడ్ల నిర్మాణంలోనే ముందంజ
పశువులు, గొర్రెలు, మేకలకు అవసరమైన షెడ్ల నిర్మాణాన్ని చేపట్టడంలో మండలం రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. రైతులు, గొర్రెల కాపరులకు వ్యవసాయ క్షేత్రాల్లో గదులు నిర్మించుకునేలా ప్రోత్సహించి 134 మంది లబ్ధిపొందారు. మరో వంద మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు కలిపి 19 మంది మాత్రమే ముందుకురావడం గమనార్హం.
అందరికంటే ముందే అడుగు..
జిల్లాలో ఈ ఏడాది అన్ని గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల కోసం స్థలాలను అన్వేషిస్తే, అప్పటికే ఈ మండలంలో సగం గ్రామాల్లో పనులు మొదలుపెట్టారు. ఇప్పుడు దాదాపు అన్ని గ్రామాల్లోనూ పనులు పూర్తి చేశారు. శ్మశాన వాటికకు అంతటా రెండు పిల్లర్లతోనే పనులు చేయిస్తే, ఇక్కడ మాత్రం నాలుగు పిల్లర్లతో పటిష్ఠంగా నిర్మించారు.
కల్లాలు, పార్కింగ్ నిర్మాణాలకు సై..
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పొలాల్లో కల్లాలు నిర్మించేందుకు దరఖాస్తులు తీసుకుంటే మండలంలో 10 గ్రామాల్లో ఈ పాటికే రైతులు ఉపాధి నిధుల భాగస్వామ్యంతో సిమెంటు కల్లాలు నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే డొంకేశ్వర్, నూత్‌పల్లి, బాద్గుణ తదితర గ్రామాల్లో 73 యూనిట్ల పనులు చివరి దశకు చేరాయి. కొత్తగా పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు జిల్లాలోని 530 పంచాయతీల్లో 252 చోట్ల స్థలాలు గుర్తించగా అందులో నందిపేట్ మండలంలోని మొత్తం 33 పంచాయతీల్లోనూ ప్రభుత్వ స్థలాలను సేకరించి ప్రతిపాదించారు.
బైపాస్ రోడ్లకు అంకురార్పణ
నందిపేట, వెల్మల్, బజార్‌కొత్తూర్, ఖుదావంద్‌పూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవతో పట్టాదారులు స్వచ్ఛందంగా భూములివ్వడంతో కొత్తగా బైపాస్ రోడ్డు పనులు చేపట్టారు. కూలీలతో, కంపోనెంట్ నిధులతో పనులు పూర్తి చేశారు. నందిపేట్-వెల్మల్ గ్రామాల మధ్య లింకు రోడ్డు పనులను ఈ పథకం కిందే ప్రారంభించారు.
కూలీలకు పని కల్పించడంలోనూ ముందే..
మండలాల్లో కూలీలకు పని దినాలు కల్పించడంలో జిల్లావ్యాప్తంగా చూస్తే ఈ మండలంలోనే 8.80 శాతం ప్రగతి సాధించింది. మొత్తంగా 2,13,751 మంది ఉపాధిహామీ పథకంలో భాగస్వామ్యం కాగా అందులో 16,957 మంది నందిపేట నుంచే ఉండడం విశేషం.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరి సహకారంతో స్థలాల అన్వేషణ, పనుల పురోగతి సాధ్యమైంది. సిబ్బంది సహకారం మరవలేనిది.
- వాకిడి సంతోష్, ఎంపీపీ, నందిపేట్
ఉపాధిహామీ పథకంలో నిధులకు కొరత ఉండదు. వీలైనన్నీ పనులను చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ కూలీలను భాగస్వామ్యం చేశాం. వచ్చే మెటీరియల్ కంపోనెంట్ నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నాం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా పని తీరును గుర్తించాయని హర్షిస్తున్నాం.
నాగవర్ధన్, ఎంపీడీవో, నందిపేట్