Seed onion cultivation: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రైతులు వరికి బదులు ఇతర డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించింది. అయితే ప్రాజెక్టులు, చెరువులు, బోర్లలో పుష్కలంగా నీళ్లుండటంతో అధికశాతం మంది వరికే మొగ్గు చూపేవారు. వరికి అలవాటు పడ్డ రైతులు పంటమార్పిడి ప్రయోగం ఫలిస్తుందో లేదోనన్న అనుమానంతో ఇప్పటిదాకా ధైర్యం చేయలేదు. అయితే నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం ధర్మారం రైతులు పంట మార్పిడికి ముందుకొచ్చారు. ఏకంగా వంద ఎకరాల్లో వరి పంటకు బదులు మెట్ట పంట అయిన విత్తన ఉల్లి సాగుకు సిద్ధమయ్యారు.
కంపెనీకి రైతుల మధ్య అంగీకారం..
పంట మార్పిడి చేస్తే నేల సారం అవుతుందన్న ఉద్దేశంతో పాటు డిమాండ్ ఉన్న పంట వేసుకోవాలని ధర్మారం రైతులు భావించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తన ఉల్లిని నిర్ణయించుకుని సంబంధిత కంపెనీని సంప్రదించగా వారు రైతులకు అవగాహన కల్పించారు. పంట సాగు, పెట్టుబడి, దిగుబడి, ధర గురించి చెప్పటంతో అన్నదాతలు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.50వేలకు క్వింటాల్ చొప్పున విత్తన ఉల్లి తీసుకునేందుకు కంపెనీ, రైతుల మధ్య అంగీకారం కుదిరింది.
విత్తన ఉల్లి అనే కాదని.. పంట ఏదైనా మార్పిడి చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని.. ధర్మారం రైతులు తెలిపారు. మిగతా వారు ఇలాగే ఆలోచిస్తే మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: