ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లలంతా ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు నిరంతరంగా గంటల పాటు తరగతులు వింటున్నారు. ఆ తర్వాత కూడా ఫోన్ను వాడుతున్నారు. దీనివల్ల పిల్లల్లో దృష్టి లోపాలు బయట పడుతున్నాయి. కంటి వైద్య నిపుణుల వద్ద కేసులు కూడా పెరుగుతున్నాయి. అవగాహన లేకపోవడంతో పిల్లలు కంటికి దగ్గరగా ఫోన్ పెట్టుకొని తరగతులు వింటున్నారు. అలాగే ఫోన్ స్క్రీన్ పైన బ్రైట్నెస్ను ఎక్కువగా పెడుతున్నారు. వెలుతురు సరిగ్గా లేని గదుల్లో... బోర్లా పడుకుని కొందరు, ఒకే పక్క పడుకొని మరికొందరు, ఫోన్లను వాడుతున్నారు.
ఫోన్ను ఎక్కువగా వాడటం వల్ల వచ్చే సమస్యలు
అదే పనిగా ఫోన్, ఇతర స్క్రీన్ చూడటం వల్ల పిల్లల్లో ఎక్కువగా డ్రై ఐ(కళ్లు తడారిపోవడం) సమస్య తలెత్తుతోంది. దీన్నే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఫోన్ బ్రైట్నెస్ ఎక్కువ చేసి కళ్లకు దగ్గరగా పెట్టుకొని... కన్నార్పకుండా చూడటం వల్ల కళ్లు తడారిపోతున్నాయి. దీని వల్ల కంటిలో నొప్పి మొదలవుతుంది. నీళ్లు కారడం, దురద, మంటగా ఉంటుంది. తరువాత కళ్లు మబ్బుగా, రెండు వస్తువులుగా కనిపించడం తలెత్తుతుంది. అలాగే తలనొప్పి, మెడనొప్పి, భుజం నొప్పి సమస్యలు అధికంగా వస్తున్నాయి.
వైద్యుల సూచనలు...
ఆన్లైన్ తరగతులు వినేటప్పుడు విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు పలు సూచనలు చేశారు. అవేంటో మీరూ చూసేయండి.
- ఫోన్లో బ్రైట్నెస్ను కళ్లకు అనువుగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కొన్ని ఫోన్లలో బ్లూలైట్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆన్ చేయాలి.
- కంటికి చేతి దూరంలో ఫోన్ను ఉంచాలి.
- కంటికి సమానంగా ఫోన్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
- కళ్లు, మెడ, ఇతర భాగాలపై భారం పడకుండా టేబుల్, కుర్చీలను పిల్లల ఎత్తుకు అనువుగా ఉండేలా చూసుకోవాలి.
- కళ్లకు సమాంతరంగా స్క్రీన్ ఉండేలా జాగ్రత్త పడాలి.
- ఆన్లైన్ తరగతులు వినే గదిలో వెలుతురు సరిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి.
- రాత్రివేళ అసలు ఫోన్ వినియోగించకపోవడమే మంచిది.
- కంప్యూటర్, టాబ్లెట్లకు తెరలు వాడాలి.
- రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల నీళ్లు తాగాలి. తద్వారా కళ్లు తడారిపోకుండా ఉంటాయి.
- 50 నిమిషాలకు ఒకసారి పూర్తిగా పది నిమిషాలు విరామం ఇవ్వాలి. తరగతులు గంటల పాటు ఉండకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.
స్క్రీన్ చూసేటప్పుడు పిల్లలైనా, పెద్దలైనా కళ్లు బ్లింక్ చేయడమనేది మర్చిపోతరు. ఈ బ్లింక్ చేయడం మర్చిపోవడం వల్ల కళ్లు త్వరగా స్ట్రెయిన్ అవ్వడం, మన కనుగుడ్డు చుట్టూ ఉండే నీటి పొర అనేది తొందరగా తడారిపోయి డ్రై ఐ సమస్య వస్తుంది. కాబట్టి బ్లింక్ చేయడం అనేది పిల్లలకు, పెద్దలకు తప్పనిసరి. పిల్లలకు అయితే కళ్లు బ్లింక్ చేయమని మనమే అర్థమయ్యేలా చెప్పాలి.
- డా.సుజాత, కంటి వైద్య నిపుణురాలు, జీజీహెచ్, నిజామాబాద్
20-20-20 నిబంధన పాటిస్తే...
20-20-20 నిబంధన పాటిస్తే దృష్టి లోపాలు తలెత్తకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. 20-20-20 నిబంధన అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20సెకన్ల పాటు విరామం ఇచ్చి కళ్లను మూసుకోవాలి. ఆ వెంటనే 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై చూపు కేంద్రీకరించాలి. ఇలా చెయ్యడం వల్ల కళ్లపై ఎక్కువ భారం పడదు. రోజులో కొంతసేపు ఫోన్ ఫ్రీ సమయం పెట్టుకుని విధిగా పిల్లలతో తల్లిదండ్రులు గడపాలి. తద్వారా కళ్లకు శ్రమ తగ్గుతుంది. పిల్లలు ఆన్లైన్ తరగతులు పూర్తయ్యాక ఫోన్ను వాడకుండా చూసుకోవాలి. అందుకు బదులుగా ఇతర పిల్లలతో కలిసి ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి. తద్వారా దూరు దృష్టి లోపం వంటి సమస్యలను రాకుండా జాగ్రత్త పడొచ్చు.
ప్రారంభంలోనే దృష్టి లోపాలను అధిగమించకుంటే దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: MURDER: కోడలితో వివాహేతర సంబంధం.. కుమారుడిని చంపిన తండ్రి!