దేవుడు కరుణించినా.. పూజారి కనికరించలేదనే చందంగా మారింది నిజామాబాద్ ప్రజావాణి పరిస్థితి. కరోనాకు ముందు ప్రతి సోమవారం వందకు పైగా ఫిర్యాదులు వచ్చేవి. కలెక్టర్ ఆ ఫిర్యాదులను సంబంధిత అధికారికి పంపించేవారు. అయినా పరిష్కారం కాక అనేక మంది ఫిర్యాదుదారులు మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌కు వచ్చి పాలనాధికారికి తమ సమస్యను చెప్పేవారు. అయినా అనేక మందికి ప్రజావాణి ద్వారా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఎన్నిసార్లు తిరిగినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. దీంతో ఉసూరుమంటూ ప్రజలు వెనుదిరగాల్సి వస్తోంది.
ప్రజావాణిలో అత్యధికంగా భూ సమస్యలు, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్త రేషన్ కార్డులు, మున్సిపాలిటీల్లో సమస్యల మీద ఫిర్యాదులు వస్తున్నాయి. కరోనా కంటే ముందు నుంచి సమస్య గురించి ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వరకు పరిష్కారం కావడం లేదని అనేక మంది మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌కు వస్తున్నారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు మొత్తం 145 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ పంపించారు. అయితే ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ప్రజలు తమ సమస్యలను మొదట మండల స్థాయిలో అధికారులకు అందిస్తారు. అయితే సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఆ సమస్యలు పరిష్కారం కాక.. ఆర్డీవోలకు అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌కు విన్నవిస్తారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా.. కింది స్థాయి సిబ్బంది పట్టింపులేని తనం కారణంగా ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోతోందని.. పదే పదే ఫిర్యాదు చేసినా పరిష్కారం చూపడం లేదంటున్నారు.
ప్రజావాణిని పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో కలెక్టర్‌కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి సమస్యలు పరిష్కారం అయ్యేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.