జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో అసువులు బాసిన ర్యాడా మహేశ్ పార్థివదేహం.. స్వస్థలం నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమన్‌పల్లికి చేరుకుంది. మహేశ్ భౌతికకాయాన్ని చూడగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దేశ సేవలోనే ఉంటాడనుకున్న తమ కుమారుడు అర్ధాంతరంగా వెళ్లిపోయాడంటూ తల్లిదండ్రులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. భర్తను చూడగానే గుండెలవిలసేలా రోధించిన భార్య సుహాసినిని అడ్డుకోవడం బంధువులకు కష్టసాధ్యమైంది. తనతో ఎంతో భవిష్యత్ ఊహించినప్పటికీ ఇలా జరుగుతుందనుకోలేదని ఆమె కన్నీటిపర్యంతమైంది.
అంతకుముందు కశ్మీర్ నుంచి మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న మహేశ్ భౌతికకాయానికి గవర్నర్ తమిళిసై ఘన నివాళులర్పించారు. ఆమెతో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. అధైర్య పడవద్దని అండగా ఉంటామంటూ మహేశ్ కుటుంబసభ్యులకు వారు భరోసా ఇచ్చారు. మహేశ్ కుటుంబ సభ్యులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మధుయాష్కీ విజ్ఞప్తి చేశారు.
ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాను మహేశ్ మరణవార్తతో సొంతూరులో విషాదఛాయలు అలుముకోగా.. పార్థివదేహం చూడగానే గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. బుధవారం మధ్యాహ్నం కల్లా మహేశ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు.. బంధువులు ఏర్పాట్లు చేశారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: 'చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న తపనే'