జాతీయ రహదారిపై ప్రయాణం సురక్షితంగా ఉండాలి. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. అడుగుకో గుంతతో దుర్భరమై రహదారులతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. లక్షల రూపాయల టోల్ వసూలు చేస్తున్న గుత్తేదారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అడుగుకో గుంత
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ నుంచి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ వరకు 60 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 925 గుంతలున్నాయి. ఇటీవల వర్షాలకు ఆ గుంతలు మరింత పెరిగి ప్రయాణికుల కష్టాలను రెట్టింపు చేశాయి. ఇందల్వాయి వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేసి ప్రతిరోజు దాదాపు 18.22 లక్షల రూపాయల టోల్ వసూలు చేస్తున్నారు. కానీ... రహదారులకు మరమ్మతులు మాత్రం చేపట్టడంలేదు. కొత్త లేయర్ వేయాలని ఎన్హెచ్ఏఐ పీడీ ఆదేశాలు జారీ చేసినా... గుత్తేదారు ఖాతరు చేయడం లేదు. ప్రయాణికులు ప్రశ్నిస్తే వర్షాలు పడుతున్నాయని కుంటి సాకులు చెబుతున్నారు.
మిన్నకున్న అధికారులు
జాతీయ రహదారి నిర్వహణను గుత్తేదారు, జాతీయ రహదారి అధికారులు సంయుక్తంగా పర్యవేక్షించాలి. రోడ్డుపై గుంతలు పడితే 24గంటల్లో పూడ్చాలి. అంబులెన్స్‌లు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేకంగా సర్వీస్ రోడ్డు నిర్మించాలి. ప్రయాణికులకు అత్యవసర సేవలు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. టోల్ ప్లాజా సమీపంలో భారీ వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. కానీ ఇవేమీ ఇందల్వాయి టోల్ వసూలు చేస్తున్న గుత్తేదారు పట్టించుకోవడం లేదు.
టోల్ మీదే దృష్టి
అడుగడుగునా గుంతలతో ప్రయాణికులు నరకం చూస్తున్నా... టోల్ వసూలు మీద తప్ప రోడ్డు నిర్వహణను గుత్తేదారు పట్టించుకోవడం లేదు. మిగతా రహదారి అంతా బాగున్నా ఇందల్వాయి టోల్ పరిధిలో మాత్రం అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేసి.... గుంతలు పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
- ఇదీ చూడండి : 'సుష్మా' భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి