Dumping Yard Issue in Nizamabad : నిజామాబాద్ నగర పాలక సంస్థకు చెందిన డంపింగ్ యార్డు అభివృద్ధికి నోచుకోవడం లేదు. నగర శివారులోని నాగారంలో 55ఎకరాల్లో ఉన్న డంపింగ్ యార్డుకు ప్రహారీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ప్రణాళిక లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తడి, పొడి చెత్త వేరు చేయడం మొక్కుబడిగానే సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డంపింగ్ యార్డులో మంటలతో ఇబ్బందులు పడుతున్నామని గతేడాది స్థానికులు ఆందోళన చేపట్టారు. అధికారులు సర్ది చెప్పడంతో వివాదం ముగిసినా.. మళ్లీ ఎండలు ముదరడంతో షరామామూలే అవుతోంది.
Dumping Yard Issue in Nagaram : : "15 ఏళ్ల క్రితం ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. ఎవరో ఒకరు వచ్చి ఊరికే మంట పెడుతున్నారు. అక్కడి నుంచి వచ్చే పొగతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కనీసం మా పిల్లల కోసమైనా.. మా సమస్యను పరిష్కరించండి. రాత్రిపూట రోజూ పొగ పెడుతున్నారు. పొగతో మా ప్రాంతమంతా కనిపించకుండా పోతుంది. ఈ పొగ వల్ల రహదారులు కనబడక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. చెత్తను రీసైక్లింగ్ అయినా చేయండి లేదా డంపింగ్ యార్డ్‌ను ఇక్కడి నుంచి తరలించనైనా తరలించండి."
- స్థానికులు
పరికరాలు లేవంట : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం 185 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. నగరంలోని ప్రధాన వీధులు, కాలనీల నుంచి చెత్త సేకరణ కొనసాగుతోంది. ఈక్రమంలో తడి పొడి చెత్తను వేరు చేయకుండా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. నగరంలోని ఇతర పనుల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న అధికారులు డంపింగ్ యార్డును మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. చెత్తను రీసైక్లింగ్ చేయడానికి పరికరాలను లేవని అధికారులు చెబుతున్నారు.
Dumping Yard Problems in Nizamabad : "రీసైక్లింగ్ చేయడానికి మా వద్ద ఎలాంటి యంత్రాలు లేవు. రీసైక్లింగ్ యంత్రాలు ఇస్తే ఆ సమస్య పరిష్కరించగలుగుతాం. కానీ ప్రభుత్వం నుంచి మాకు సాయం లేదు. అందువల్ల మేమేం చేయలేకపోతున్నాం."
- మహమ్మద్ గౌస్, డంపింగ్ యార్డ్ ఇంఛార్జ్
పరిష్కరించండి లేదా తరలించండి : డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు. చెత్త కాల్చటంతో పరిసరాల్లో కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను పునర్వినియోగం చేయాలని లేదంటే డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.
- ఇదీ చదవండి : కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి