వాళ్లంతా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన కార్మికులు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడం వల్ల చేతికి పనిలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిపోతున్నారు. దీనివల్ల తమ సొంతూళ్లకు పయనమైన వలస కార్మికులను మార్గమధ్యలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చూశారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులు.. కుటుంబాల పరిస్థితి అడిగితెలుసుకున్నారు.
రహదారి వెంట చిన్న పిల్లలతో నడిచి వెళ్లడాన్ని చూసి చలించిపోయిన మంత్రి వారికి కడుపు నిండా అన్నం పెట్టి మహారాష్ట్ర సరిహద్దు వరకు పంపించారు. గత మూడు రోజులుగా వలస కార్మికులను ఇలాగే భోజనం పెట్టి పంపిస్తున్నారు. వలస కార్మికులు మంత్రి తీరుపట్ల హర్షం వ్యక్తం చేశారు.