KTR Responded On Kamareddy Master Plan issue : రాష్ట్రంలో పురపాలికల బృహత్ ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్)ల రూపకల్పనలో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు లేదని, సహాయకారిగా ఉండేందుకే ఉందని గుర్తించాలన్నారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ఇంకా ముసాయిదా దశలోనే ఉందన్న అంశంపై ప్రజలకు ఎందుకు అవగాహన కలిగించలేదని ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. సమస్య సృష్టించేలా కాకుండా ప్రజలకు అనుకూలంగా ఉండేలా బృహత్ ప్రణాళికలు రూపొందించాలన్నారు. కామారెడ్డి పురపాలికలో 500 ఎకరాలను పారిశ్రామిక జోన్‌లో పెట్టడంపై నిరసన కార్యక్రమాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన పట్టణప్రగతి వర్క్‌షాప్‌లో మాట్లాడారు. పురపాలకశాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ, ఆస్కి డైరెక్టర్ శ్రీనివాసాచారి, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), రాష్ట్రంలోని 141 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థల కమిషనర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై అదనపు కలెక్టర్ వెంకటేశ్‌ను మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డిలో ప్రజలు ఆందోళన చేస్తున్నారని, ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిందని అన్నారు. ఈ విషయంలో ప్రజలతో చర్చించి.. సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నిర్మాణాత్మకమైన, ప్రణాళికాబద్ధమైన పట్టణాల అభివృద్ధి లక్ష్యమని, అందులో భాగంగా మాస్టర్‌ప్లాన్లు తయారు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పలు పురపాలికల మాస్టర్‌ప్లాన్లు ముసాయిదా స్థితిలోనే ఉన్నట్లు డీటీసీపీ చెప్పారని అన్నారు. వాటిపై ప్రజలనుంచి అభ్యంతరాలు వస్తే క్రోడీకరించి డీటీసీపీ, పురపాలకశాఖ డైరెక్టర్‌తో మాట్లాడాలని పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లకు సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు కానీ అభ్యంతరాలు ఇస్తే సమగ్రంగా పరిశీలించాలన్నారు. ఒత్తిళ్లను పట్టించుకోకుండా ఏది సరైనదో..అదే చేద్దామన్నారు. మాస్టర్‌ప్లాన్ల రూపకల్పన ప్రక్రియలో కామారెడ్డిలాంటి ఉదంతాలు ఇంకా ఎక్కడైనా ఉంటే అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. మాస్టర్‌ప్లాన్లంటినీ ఈ సంవత్సరమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
త్వరలోనే వార్డుకో అధికారి: పురపాలకశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయని అన్నారు. త్వరలో వార్డుకు ఒక అధికారి అందుబాటులోకి రానున్నారని అన్నారు. రాబోయే అయిదేళ్లలో ప్రజలు ఎక్కువగా పట్టణాల్లోనే ఉంటారని, దీనిని దృష్టిలో ఉంచుకుని పట్టణాభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో పుర ప్రగతికి రూ.16 వేల కోట్లను వ్యయం చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. టీఎస్ బీపాస్ అద్భుతమైన సంస్కరణ అని, దీన్ని మరింత మెరుగుపరిచేందుకు సూచనలు ఇవ్వాలని కమిషనర్లను కోరారు.
అభివృద్ధిపై సమీక్ష: ప్రజలనుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై అదనపు కలెక్టర్లు సమీక్షించాలని సూచించారు. పురపాలనలో పది సూత్రాల అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. ప్రతి పట్టణంలో సమీకృత మార్కెట్ల నిర్మాణం, ఇంటింటికీ రక్షిత మంచినీరు అందించేలా అర్బన్ మిషన్ భగీరథ అమలు, వైకుంఠధామాల నిర్మాణం, గ్రీన్ బడ్జెట్ అమలు, అధునాతన ధోబీఘాట్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణకు బయోమైనింగ్, మానవవ్యర్థాల శుద్ధికేంద్రాల ఏర్పాటు, డిజిటల్ డోర్ నంబర్ల కేటాయింపు వంటి కీలకాంశాలను ప్రధాన ఎజెండాగా భావించి ప్రతిరోజూ వాటి పురోగతిని సమీక్షించాలన్నారు. రాష్ట్రంలో 141 పురపాలక పట్టణాలు ఉంటే వాటిలో 42 పట్టణాలు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్‌గా ఉండటం అద్భుతమైన అంశమన్నారు. మిగిలిన పట్టణాలు ఈ గుర్తింపు సాధించాలన్నారు. వ్యర్థాల శుద్ధిలో జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్ లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించి ఉత్తమ పనితీరు కనబరిచిన పురపాలక అధికారులకు వివిధ కేటగిరీల కింద అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఇవీ చదవండి: