కోవిడ్ సమయంలో అందించిన సేవలకు ప్రజల నుంచి వచ్చిన మంచి పేరు, ప్రశంసలను వైద్యాధికారులు, సిబ్బంది నిలుపుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. కేసీఆర్ కిట్ పథకం అమలుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద సంఖ్యలో ప్రసవాలు పెరిగాయనీ పేర్కొన్నారు.
నాణ్యత జోడిస్తూ..
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బందికి నిర్వహించే దక్షత శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ కిట్ ద్వారా పెరిగిన ప్రసవాల సంఖ్యకు నాణ్యతను జోడిస్తూ సేవలు మరింత విస్తృతం చేయాలని కోరారు.
ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారికి దక్షత శిక్షణ అందించడం ద్వారా వారు తమ అనుభవానికి నేర్చుకున్నదాన్ని జోడించి గొప్పగా సేవలందించడానికి వీలవుతుందని తెలిపారు. దానిద్వారా శిక్షణ తీసుకున్న వారికి, సేవలు పొందేవాళ్లకెంతో ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.
పెంచుకోవాలి..
కరోనా సమయంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అందించిన సేవలకు ఎంతోమంది ప్రశంసిస్తూ ఫోన్లు చేశారని, అందుకు ప్రజల తరపున వైద్యాధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రోజుకు 17 వందలుగా ఉన్న ఓపీ సేవలు కోవిడ్ వేళ తగ్గి ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటున్నాయని పేర్కొన్నారు. వాటిని మూడు వేలకు పెంచుకోవాలని సూచించారు.
అన్ని సేవలూ రెండింతలయ్యేలా కృషి చేయాలని డాక్టర్లు, వైద్య సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఇందిర, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అసౌకర్యాలకు అడ్డా... గద్వాల దవాఖానా