కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని సీఐటీయూ సీనియర్ నాయకులు రాజారావు అన్నారు. కొత్త చట్టాల వల్ల మద్దతు ధర లేకపోవడం, నిత్యావసర సరుకులపై కృత్రిమంగా ధరలు పెంచుతారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పోరుయాత్రలో భాగంగా నిజామాబాద్‌లోని బోర్గం(పి) వద్ద జీపు జాతాను జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు, కార్మికులు, పేదలకు ఏలాంటి ప్రయోజన లేదన్నారు. కేవలం కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. దేశ రాజధానిలో రైతులు చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో పోరుయాత్రకు ప్రజలు అండగా నిలవాలని రాజారావు కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.వి రమ, జిల్లా అధ్యక్షుడు కె.రామ్మోహన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు, మల్యాల గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.