సర్కారీ బడి అనగానే శిథిల భవనాలు, విరిగిన బెంచీలు, తిరగని ఫ్యాన్లు, ప్రైవేట్ సంస్థల్లో చేరగా మిగిలిన విద్యార్థులు. ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బోర్గాం పాఠశాల పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. వందల మంది విద్యార్థులు, పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు, ఒక్కో తరగతిలో నాలుగైదు సెక్షన్లు, డిజిటల్ పద్ధతిలో పాఠాల బోధన... ఇవీ అక్కడ మనకు కనిపించే దృశ్యాలు. 2014లో అన్ని పాఠశాలల్లాగే ఉన్న ఈ పాఠశాల రెండు మూడేళ్లలోనే ప్రగతిని సాధించి... ఐదేళ్లు తిరిగే సరికి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది.
వసతుల కల్పనతో ముందడుగు
2014లో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన నర్రా రామారావు పాఠశాల స్థితిగతులను పూర్తిగా మార్చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం గమనించిన ఆయన ఒక్కొక్కటిగా వసతులు కల్పిస్తూ వచ్చారు. ఉత్తమ విద్యను అందిస్తూ తల్లిదండ్రుల ఆదరణ చూరగొన్నారు. మంచి ఫలితాలతో పాటు ట్రిపుల్ ఐటీలోనూ సీట్లు సాధిస్తుండడం వల్ల సర్కారీ బడిపై తల్లిదండ్రులకు గురి కుదిరింది. అప్పట్లో 550 మంది విద్యార్థులుండగా... మూడేళ్లలోనే ఆ సంఖ్య వెయ్యికి చేరింది. ప్రస్తుతం ఆ పాఠశాలలో 1440 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో విద్యను అందిస్తుండడం వల్ల ప్రైవేటు సంస్థలకు వెళ్లే వారు సైతం ప్రభుత్వ పాఠశాల వైపే మొగ్గు చూపుతున్నారు.
వినూత్నంగా బోధన
ఈ పాఠశాలలో విద్యార్థులు ప్రతి ఏటా 9 జీపీఏ సాధించేవారు పదుల సంఖ్యలో ఉన్నారు. అలాగే ట్రిపుల్ ఐటీలో సీట్ల సాధనలోనూ ముందంజలో ఉన్నారు. అందరికీ ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞానం పెంచుకునే అంశాలపై చర్చ, ప్రయోగాత్మక బోధన, డిజిటల్ పద్ధతులు వంటివి ఈ పాఠశాలను మిగిలిన వాటి కంటే విభిన్నంగా నిలబెట్టింది. ప్రిన్సిపాల్ రామారావు స్వయంగా 9, 10 తరగతులకు జీవశాస్త్రం బోధిస్తూ మిగతా ఉపాధ్యాయుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ చాటేలా తర్ఫీదునిస్తున్నారు. పాఠశాలను ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2017 సంవత్సరానికి గానూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రధాని మోదీ చేతుల మీదుగా గతేడాది అవార్డు అందుకున్నారు.
ఆహ్లాదకర వాతావరణంలో...
జిల్లా కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఉన్న బోర్గాం పాఠశాల పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో ఆకట్టుకుంటుంది. ఇక్కడి వినూత్న విద్యా బోధనతో తాము అన్ని రంగాల్లో ప్రతిభ చూపించగలుగుతున్నామని విద్యార్థులు అంటున్నారు. డిజిటల్ పద్ధతిలో చెప్పడం వల్ల ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయని చెబుతున్నారు. బోధన పట్ల అంకితభావం, పట్టుదల, కృషితో జాతీయ స్థాయిలో ఈ పాఠశాలకు గుర్తింపు తెచ్చారు ప్రిన్సిపాల్ నర్రా రామారావు. ఇలాంటి పాఠశాలలు రూపుదిద్దుకుంటే రాష్ట్రంలో ఇక ప్రైవేట్ పాఠశాలల అవసరమే ఉండదు.
ఇదీ చూడండి : అదరహో ఎస్సారెస్పీ అందాలు... ఇవిగో డ్రోన్ దృశ్యాలు