మానవత్వమే మనిషి తత్వమని చిన్నప్పటి నుంచి తండ్రి అహ్మద్‌ఖాన్ చెప్పిన మాటలు ఆమెపై ప్రభావం చూపాయి. అవే అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేయడానికి నాందివేశాయి. నిజామాబాద్ జిల్లా రాకాసిపేట్కు చెందిన హిబా ఫాతిమా హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత గురించి తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో వీడియోలు చూసేది. అందులోని శ్లోకాలకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన భావాలు చెప్పడం వల్ల గందరగోళానికి గురైన ఆమె.. దానికి పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకుంది. భగవద్గీతను పూర్తిగా చదివి ఉర్దూలోకి తర్జుమా చేయాలనుకుంది.
మెసేజ్ ఫర్ ఆల్
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో భగవద్గీతను కూలంకషంగా అధ్యయనం చేసి సులభంగా అర్థమయ్యేలా ఉర్దూలోకి అనువాదం చేయడం ప్రారంభించింది. మూడు నెలల్లో ఈ గ్రంథంలోని 700 శ్లోకాలు, 18 అధ్యాయాలను తర్జుమా చేసింది. శ్లోకాలను ఉర్దూలో రాసే సమయంలో హిబా ఎన్నో అనువాద సమస్యలు ఎదుర్కొంది. రెండు గ్రంథాల సారాంశాన్ని వివరించడానికి "మెసేజ్ ఫర్ ఆల్" పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. అందులో ఇప్పటివరకు 80 వీడియోలను పోస్ట్ చేసింది.
సారూప్యతను వివరిస్తూ...
గీత చదివే సమయంలో కొన్ని శ్లోకాల తాత్పర్యం, ఖురాన్‌లోని ఆయాద్ల అర్థం.... రెండూ ఒకేలా ఉండేవి. ఇప్పటి వరకు రెండు గ్రంథాల్లో ఒకే అర్థం వచ్చిన శ్లోకాలను 500 వరకు గుర్తించింది హిబా. ఈ రెండు గ్రంథాల్లోని సారూప్యతను తెలియజేస్తూ 'సిమిలారిటీస్ బిట్వీన్ భగవద్గీత అండ్ ఖురాన్' అనే పుస్తకం రాయడం మొదలుపెట్టింది. 'అన్ని మత గ్రంథాలు మనిషి ఎలా జీవించాలో తెలియజేస్తున్నాయని అంటోన్న హిబా.. మానవత్వమే ప్రధాన మతమని చాటిచెప్పేందుకు భవిష్యత్తులో పలు కార్యక్రమాలు చేపడతానని తెలిపింది.
- ఇదీ చూడండి : బధిరుల పాఠశాల కాదు.. అందమైన హరితవనం..