కరోనా దేశవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తున్న వేళ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటే, మరికొందరు లేనిపోని భయాలు పెట్టుకొని అసువులు బాస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన కందగిరి సుశీల(68) పక్కింటి వారికి కరోనా పాజిటివ్ వచ్చింది.
వారం క్రితం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ పరీక్ష కేంద్రానికి వచ్చి రాపిడ్ టెస్ట్ చేయించుకుంది. తరచూ అదే ఆందోళనకు గురయిన వృద్ధురాలు చాతి పట్టేసినట్లు ఉండటంతో శుక్రవారం మరోసారి పరీక్ష కేంద్రానికి వచ్చారు. నమూనా ఇచ్చే క్రమంలో వాంతి చేసుకున్నట్లు వైద్య సిబ్బంది వివరించారు. ఫలితం వచ్చేలోగానే మరోసారి వాంతి చేసుకుని అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
కాగా ఈ పరీక్షలోనూ ఆమెకు నెగిటివ్ రావడం విశేషం. మానసిక ఆందోళనతోనే ఆమెకు గుండెపోటు వచ్చి మృతి చెంది ఉంటుందని వైద్యాధికారి రఘువీర్ గౌడ్ ప్రాథమిక అంచనాకు వచ్చారు. వైరస్ సోకినా మానసికంగా దృఢంగా ఉండి వైద్యుల సూచనలు పాటిస్తే త్వరగా తగ్గిపోతుందన్నారు.
ఇదీ చదవండి: మినీ పురపోరు పూర్తిగా సాఫీగా సాగింది: ఎస్ఈసీ