నిర్మల్ జిల్లాలోని గ్రామాల్లోని మహిళల్లో సగానికి పైగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వారంతా ప్రతి నెలా పొదుపు చేస్తూ, రుణాలు తీసుకుంటూ ఆర్థిక స్వావలంభన సాధించారు. రైతు ఉత్పత్తులను కొనుగోళ్లు చేసే రంగంలో అడుగుపెట్టి రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. గ్రామసంఘాల నాయకత్వ బాధ్యతలు చూసే మహిళలు.. అక్షరాలు నేర్చుకొని ఆర్థిక లావాదేవీలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సభ్యుల్లో చదువుకున్న వారి సంఖ్య తక్కువే ఉన్నా.. పలు రంగాల్లో వారు రాణిస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి లక్షల రూపాయలు తీసుకురావడం, సభ్యులకు పంచడం వంటి పనుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు.
అందరికీ చదువు వచ్చేలా...
జిల్లాలో స్వయంసహాయక సంఘాల్లోని సభ్యుల్లో 88,182 మంది నిరక్షరాస్యులున్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ చదవడం, రాయడం నేర్పించేందుకు ఆయా సంఘాల్లోని చదవుకున్న వారిని మెంటర్లుగా ఎంపిక చేశారు. వారే సంఘంలోని మిగతా వారికి చదువు నేర్పాలి. ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ పురోగతి సాధించేందుకు సంఘాల అధ్యక్షులు, సెర్ప్ సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ మేరకు మండలాల వారీగా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఇప్పటికే చదువుకున్న వారుంటే వారి విద్యార్హతను కంప్యూటరీకరిస్తున్నారు. ఎక్కడ ఎవరు మెంటర్‌గా బాధ్యతలు తీసుకుంటున్నారు.. వారు ఏ మేరకు ప్రగతి సాధించారో తెలుసుకునేందుకు తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి : కరోనాతో నర్సుల యుద్ధం..మృత్యువుతోనే పోరాటం..