మన రాష్ట్రంలో జరగాల్సిన వివాహం కరోనా కారణంగా అమెరికాలో జరిగింది. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన జ్యోతి- ప్రకాష్ దంపతుల కుమార్తెకి.. మహారాష్ట్రకు చెందిన లక్ష్మి- నారాయణ రెడ్డి కుమారుడు నవీన్ రెడ్డితో రెండేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగింది. అనంతరం వారు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లారు. కరోనా పరిణామాలు, వీసా ఇబ్బందులతో వాళ్లిద్దరూ ఇక్కడికి రాలేక.. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లలేకపోయారు. దీంతో అమెరికాలో స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో శనివారం రాత్రి వివాహం చేసుకున్నారు.
ఆ పెళ్లి ప్రత్యక్షప్రసారాన్ని భైంసాలో వధువు తల్లిదండ్రులు, హైదరాబాద్‌లో వరుడి తల్లిదండ్రులు వీక్షించారు. బంధువులు, స్నేహితులను ఆహ్వానించి.. ప్రొజెక్టర్లలో పెళ్లిని తిలకించారు. నవవధువులను ఇక్కడి నుంచే దీవించారు. అనంతరం పెళ్లి భోజనాలు చేశారు.
తమ కూతురికి రెండు సంవత్సరాల క్రితం నిశ్చితార్థం జరిగిందని వధువు తండ్రి ప్రకాష్ చెప్పారు. రెండుసార్లు పెళ్లి ముహూర్తం పెట్టుకుని కల్యాణ మండపాలు బుక్ చేసుకున్నామని చెప్పారు. కరోనా కారణంగా మళ్లీ వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని వివరించారు. వధూవరులు అమెరికాలో ఉండటంతో కరోనా నిబంధనల కారణంగా పెళ్లి అక్కడే జరిగిందని పేర్కొన్నారు. అందుకే మండపంలో ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి.. బంధువులతో కలిసి కల్యాణ వేడుకను వీక్షించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Revanth Reddy: కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో త్వరలో దళిత, గిరిజన దీక్ష'