టీకా పంపిణీ విషయంలో వైద్యసిబ్బందికి, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో డోసు కోసం వ్యాక్సినేషన్ కేంద్రానికి జనాలు చేరుకున్నారు. అయితే వైద్యులు మాత్రం మొదటి డోసు తీసుకున్న 42 రోజుల తర్వాత టీకా వేస్తామని చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో వైద్యసిబ్బందికి, ప్రజల మధ్య గొడవకు దారితీసింది. రెండు రోజులుగా వ్యాక్సిన్ కోసం తిరుగుతున్నామని.. ఉదయం 5 గంటల నుంచి వరుసలో నిలబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైద్యులు వ్యాక్సినేషన్ కేంద్రానికి చేరుకుని ప్రజలకు నచ్చజెప్పారు. అనంతరం టీకా పంపిణీ ప్రారంభించడంతో గొడవ సద్దుమణిగింది.