లాక్డౌన్ నేపథ్యం పేదవారికి సాయం చేసేందుకు దాతలు ముందుకురావడం అభినందనీయమని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. నిర్మల్ పట్టణంలోని కొయ్యబొమ్మల కేంద్రం వద్ద నిర్మల్ గ్రామీణ సీఐ శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సాహంతో మురళీకృష్ణ ఆలయ అసోసియేషన్ సభ్యులు చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అత్యవసర సమయంలో ఆకలితో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్న మురళీకృష్ణ ఆలయ అసోసియేషన్ సభ్యుల సేవలు అభినందనీయమని ఎస్పీ అన్నారు. కళాఖండాలు, చిత్రాలను జీవం ఉట్టిపడేలా రూపొందించే నిర్మల్ పెయింటింగ్ కళాకారులు లాక్డౌన్ కారణంగా పనులు లేక, వ్యాపారం సాగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం తెలుసుకొని వారికి నిత్యావసర సరుకులు అందించేందుకు ముందుకు వచ్చిన మురళీకృష్ణ ఆలయం అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. దాదాపు 50 మంది నిర్మల్ పెయింటింగ్ కళాకారులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ గల సరకులు పంపిణీ చేశారు. గత కొన్ని రోజులుగా ఆలయ కమిటీ అసోసియేషన్ వారు తోచిన రీతిలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారని, తన చేతుల మీదుగా ఆకలితో ఉన్న వారికి సరకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో దాతలు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, మురళీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఉపాధి లేక చిరు వ్యాపారుల ఇబ్బందులు