నిర్మల్ జిల్లాలో గిరి వికాసం పథకం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గిరివికాసం పథకం అమలుపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
జిల్లాలో గిరి వికాసం పథకం అమలులో భాగంగా గిరిజన రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని.. ఆర్థికాభివృద్ధి సాధించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఫారూఖీ ఆదేశించారు. సాగునీటి వసతి లేని ఐదు ఎకరాలు కలిగిన గిరిజన రైతులకు ప్రభుత్వం బోరుబావులు, విద్యుత్ మోటార్లను మంజూరు చేస్తుందని తెలిపారు.
ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం ద్వారా 86 మంది రైతులకు బోరుబావులు, విద్యుత్ మోటార్లు మంజూరు చేశామన్నారు. గిరిజన ప్రాంతాల రైతులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గతంలో ఇందిరా జలప్రభ పథకం ద్వారా చేపట్టిన పనులను త్వరగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: హెల్ప్‌లైన్ వ్యవస్థలపై అవగాహన ఉండాలి : స్మితాసబర్వాల్