ముధోల్ సర్పంచ్ సస్పెన్షన్కు వ్యతిరేకంగా నిర్మల్ కలెక్టరేట్ ముందు గ్రామస్థులు ఆందోళనకు యత్నించారు. ముధోల్ సర్పంచ్ రాజేందర్, ఉప సర్పంచ్ సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వారిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయమై సర్పంచ్, ఉపసర్పంచ్ వర్గీయులు నిర్మల్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ముధోల్, భైంసా, నర్సాపూర్(జి), దిలావర్పూర్ పోలీసులు రహదారులపై గ్రామస్థులను ఎక్కడికక్కడే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. నర్సాపూర్(జి) పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది వివిధ మార్గాల్లో జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న నిర్మల్ పట్టణ పోలీసులు కలెక్టరేట్ ఎదుట డీఎస్పీ ఉపేందర్ రెడ్డి నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం వద్దకు రాకముందే పలువురు మహిళలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులను గమనించిన కొంతమంది మహిళలు భయాందోళనలకు గురై తిరిగి వెళ్లిపోయేందుకు యత్నించారు. అయినా పోలీసులు వెంటపడటం వల్ల ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు కొందరు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.
"ముధోల్ మండల కేంద్రం అభివృద్ధి చేస్తున్నాననే అక్కసుతోనే స్థానిక ఎమ్మెల్యే నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉంది. సస్పెన్షన్పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం."
-రాజేందర్, సస్పెన్షన్కు గురైన సర్పంచ్
ఇదీ చదవండి: లాఠీఛార్జ్ చేసిన సీఐపై హత్యాయత్నం కేసు పెట్టాలి: బండి