వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గడీని బద్దలు కొడతామని పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు అన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో సోయం పర్యటించారు. కడ్తాల్, పాకపట్ల, మాదాపూర్, సోన్ గ్రామాల్లో భాజపా జెండా ఆవిష్కరించి.. కార్యకర్తలు, రైతులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.
రైతే రాజు కావాలనే ఉద్దేశంతో కేంద్రం కొత్త చట్టాలను ప్రవేశపెడితే.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. దొడ్డు బియ్యం పండిస్తే ధర రాదని, సన్న బియ్యాన్ని పండించాలని చెప్పిన కేసీఆర్.. ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసెమ్మ రాజు, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'చైనాతో వివాదం ఎప్పుడు ముగుస్తుందో ఊహించలేం'