కొత్త రెవెన్యూ చట్టం సీఎం కేసీఆర్ స్వప్నమని దేవాదాయ శాఖ మంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్లో తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టంపై రాష్ట్ర ప్రజలు, రెవెన్యూ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు తొలిగిపోతాయని, ఏవైనా సమస్యలు ఉంటే కోర్టు ద్వారానే పరిష్కారం చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మేలుతో రైతులు సంతోషంగా ఉన్న సమయంలో కేంద్రం కొత్త వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టి నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త బిల్లులను తెరాస ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని... దిల్లీలో తమ ఎంపీలు పోరాటం చేస్తారని తెలిపారు. రైతుల పంటలను కార్పొరేట్ పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి దుయ్యబట్టారు. రైతు వ్యతిరేక బిల్లులను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.