నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొన్ని నెలల నుంచి చిరుత సంచారం కలకలం రేపుతోంది. అక్కడక్కడ పశువులపై దాడులు చేస్తుండడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. నెల రోజుల క్రితం తనూర్ మండలంలో, వారం రోజుల క్రితం భైంసా మండలంలో, తాజాగా కుబీర్ మండలంలో చిరుత ఆవుపై దాడి చేసింది. ఆవును చంపి వెనుక భాగం తిని వెళ్ళిపోయింది. సంఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారులు శనివారం పరిశీలించారు.
అటవీశాఖ అధికారులకు ఆ కళేబరం వేరే వద్ద కనిపించగా... చిరుత రాత్రి మళ్లీ వచ్చి వెళ్లిందని గుర్తించారు. 6నెలల్లో 4సార్లు వేరువేరు చోట్ల చిరుత పులులు దాడులు చేశాయి. ముధోల్ నియోజకవర్గంలో 4 చిరుతలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు అప్పట్లో గుర్తించారు. కానీ ఒకటే చిరుత ఉందా లేక చాలా ఉన్నాయా అని ప్రజలు గాబరా పడుతున్నారు.
చిరుత తమ గ్రామ శివారులో సంచరించడంతో భయమేస్తోందని... పొలం పనులకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు వాపోయారు. చేతికి వచ్చిన పంటలను రాత్రి వేళల్లో అటవీ జంతువుల నుంచి కాపాడుకోవడానికి కాపలా వెళ్లాలంటే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను వెంటనే పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికంగా చిరుత అడుగులు కనిపించాయని అటవీ అధికారులు తెలిపారు. చిరుత పులి ప్రజలకు హాని కలిగించదని... విద్యుత్ తీగలు, వలలు వంటివి పెట్టి చంపే ప్రయత్నం చేయవద్దని సూచించారు.
ఇదీ చదవండి: 9 నెలల తర్వాత భక్తులకు 'పూరీ' దర్శనం